గుడివాడ - గుడివాడ

గుడివాడ
గుడివాడ

2014 సాధారణ ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి గెలుపొందారు. తన సమీప టిడిపి అభ్యర్ధి , మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై 11537 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గతంలో రెండుసార్లు టిడిపి తరపున గెలిచిన నాని, వైసిపిలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ మేరకు తటస్థంగా ఉండకుండా, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలలో ఆయన గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అట్లూరు సుబ్బారావుకు 3106 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు టిడిపిలోకి వచ్చినా పోటీ చేయలేదు. 2009 ఎన్నికలలో రావి వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలోకి దిగితే , మాజీ మంత్రి పిన్నమనేని కాంగ్రెస్ తరపున దిగారు.  వీరిద్దరూ ఈసారి టిడిపిలోకి వచ్చినా, కొడాలి నాని గెలవడం విశేషం.
టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ సిఎం ఎన్టీ రామారావు ఇక్కడ 1983,85లలో గెలిచారు. రాష్ట్రంలోని తొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేసి ఎనిమిదిచోట్ల గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. 
1983లో గుడివాడ, తిరుపతి, 1985లో గుడివాడ, హిందూపూర్, నల్గొండ, 1989లో హిందూపూర్, కల్వకుర్తి, 1994లో హిందూపూర్ , టెక్కలిలలో పోటీ చేసి ఒక్క కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయారు. 1985లో మూడు ప్రాంతాలలో గెలిచిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కింది. గుడివాడలో పేరున్న రాజకీయ కుటుంబం ఇక్కడ నాలుగుసార్లు గెలిచింది. రావి శోభనాద్రి చౌదరి రెండుసార్లు, ఆయన పెద్ద కుమారుడు హరగోపాల్ ఒకసారి గెలిచారు. అయితే హరగోపాల్ గెలిచిన కొద్దిరోజులకే రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. 2004లో రావి కుటుంబాన్ని ఓడించి కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009,2014లలో కూడా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. గుడివాడలో మరో ప్రముఖుడైన కటారి సత్యనారాయణ రెండుసార్లు గెలిస్తే, ఆయన కుమారుడు ఈశ్వర్ కుమార్ ఒకసారి గెలుపొందారు.  ఈశ్వర్ కుమార్ కొంతకాలం మంత్రిగా కూడా పని చేశారు. వేముల కూర్మయ్య గుడివాడలో ఒకసారి తిరువూరులో మరోసారి గెలుపొందారు. గంజి రామారావు గుడివాడలో రెండుసార్లు గెలిచారు. ఎవి.సుబ్రహ్మణ్యం గుడివాడలో ఒకసారి, కైకలూరులో మరోసారి గెలుపొందారు. 
గుడివాడకు మొత్తం 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఎనిమిదిసార్లు, సిపిఐ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి వైసిపి గెలుపొందింది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు రెండుసీట్లు సిపిఐ గెలుచుకుంది. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close