పుంగనూరు - పుంగనూరు

2014 సాధారణ ఎన్నికలలో పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత, వైసిపి అభ్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదోసారి గెలుపొందారు. ఆయన తన సమీప టిడిపి అభ్యర్ధి ఎం.వెంకటరమణరాజుపై 31731 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.వెంకటరమణారెడ్డికి 2220 ఓట్లు వచ్చాయి. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి ఆ తర్వాత రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. తర్వాత రోశయ్య క్యాబినెట్ లో కూడా కొనసాగారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. వైసిపిలో చేరి మరోసారి గెలిచారు. ఈయన కుమారుడు మిధున్ రెడ్డి కూడా రాజంపేట లోక్ సభ కు ఎన్నికయ్యారు.
16సార్లు పుంగనూరు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు గెలిచాయి. టిడిపి ఆరుసార్లు, వైసిపి ఒకసారి గెలిచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో రెండుసార్లు గెలిస్తే పీలేరులో మూడుసార్లు గెలుపొందారు. ఎన్. రామకృష్ణారెడ్డి మూడుసార్లు ఇక్కడ గెలవగా, ఆయన కుమారుడు అమరనాథరెడ్డి పుంగనూరులో రెండుసార్లు, పలమనేరులో రెండుసార్లు గెలిచారు. అమరనాథరెడ్డి టిడిపి నుంచి వైసిపిలో చేరి 2014లో గెలిచారు. రామకృష్ణా రెడ్డి చిత్తూరు లోక్ సభ స్థానానికి మూడుసార్లు ఎన్నికయ్యారు.