ములుగు - ములుగు

ములుగు(ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,99,138. అందులో పురుషులు - 98,791, మహిళలు - 1,00,330, థర్డ్ జెండర్ - 17 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ తరపున ఆపధర్మ మంత్రి ఆజ్మీరా చందులాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డి. అనసూయ అలియాస్ సీతక్క ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుండి భానోతు దేవీలాల్, బిఎల్ఎఫ్ నుంచి తవిటి నారాయణ(బిఎల్పీ) పోటీకి దిగారు.
సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న సీనియర్ నేత చందూలాల్ మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు. అనంతర పరిణామాలలో ఆయన టిఆర్ఎస్ లో చేరి ములుగు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత మంత్రివర్గ విస్తరణలో చందూలాల్ కు మంత్రి పదవి వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ (సీతక్క) సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయారు. ఆమెకు 39441 ఓట్లు వచ్చాయి.
ములుగుకు 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిచాయి. టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందులాల్ ఇక్కడ నుంచి ఇంతకుముందు కూడా రెండుసార్లు గెలిచి కొంతకాలం ఎన్టీఆర్ కేబినెట్ లో పని చేశారు. రెండుసార్లు టిడిపి తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009లో టిఆర్ఎస్ తరపున మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంతకాలం నక్సల్స్ కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొని ఆ తర్వాత ఆ పంథాను వీడి టిడిపిలో చేరారు. ములుగు నియోజకవర్గం రిజర్వుడ్ అయినప్పటి నుంచి పన్నెండుసార్లు గిరిజనులు ఎన్నికయ్యారు. అంతకుముందు ఇతర వర్గాలవారు మూడుసార్లు గెలిచారు.
ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే , మంత్రి అజ్మీరా చందులాల్ నే రంగంలోకి దింపింది.